top of page
MediaFx

లోక్‌సభ ఎన్నికల బరిలో ఆ బలమైన నాయకుడికి పోటీగా బర్రెలక్క..


బర్రెలక్క అలియాస్ కర్నె శిరీష.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో స్వతంత్ర్య అభ్యర్థిగా బరిలో నిలిచిన ఆమె రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను తన వైపునకు తిప్పుకుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగ యువత ఆమెకు పెద్ద ఎత్తున మద్దతు తెలిపారు.  కొల్లాపూర్ నియోజకవర్గానికి సంబంధించి ప్రధాన రాజకీయ పార్టీలకు ధీటుగా దూసుకెళ్లారామె. అయితే ఎన్నికల్లో బర్రెలక్కకు కేవలం 5, 754 ఓట్లు మాత్రమే పోలయ్యాయి. ఎన్నికల్లో ఓటమి పాలైనా సరే నిరుద్యోగుల తరపున తన పోరాటం ఆపనంటూ బర్రెలక్క అప్పుడే ప్రకటించింది.  అయితే ముందు చెప్పినట్టుగానే లోక్ సభ ఎన్నికల బరిలో కూడా నిలిచింది. 

ఈ మేరకు మంగళవారం నాగర్ కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి స్వతంత్ర ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసింది శిరీష. ఎలాంటి హడావుడి, లేకుండా.. కేవలం తన భర్త, కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులతో కలిసి నాగర్ కర్నూల్ జిల్లా రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. 

కాగా ఇదే స్థానం నుంచి బీఆర్ఎస్ తరఫున ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి దిగనున్నారు. గతంలో బర్రెలక్కకు ఆర్ఎస్పీ గట్టిగా మద్దతు తెలిపారు. బీఎస్పీలోకి రావాలని కూడా ఆహ్వానించినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పుడు అదే ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ కు ప్రత్యర్థిగా బర్రెలక్క పోటీకి దిగడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.


Comments


bottom of page