top of page

బంగ్లాదేశ్ ప‌రిణామాలు - విశ్వ‌గురు వైఫ‌ల్యం? మాజీ ఎంపి సుర‌వ‌రం సుధాక‌ర్ రెడ్డి..🌍


బంగ్లాదేశ్ పరిణామాలు మన దేశాన్ని కూడా నిర్ఘాంత పరిచాయి. నాలుగవసారి ప్రధాని అయిన కొద్ది నెలలకే శ్రీమతి హసీనా వాజెద్ అవమానకరంగా దేశం విడిచి భారత్ పారిపోయి వచ్చింది. ఆమె పాలనలో దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందినా, మౌలిక సమస్యలు పరిష్కారం కాలేదు. నిరుద్యోగం అసాధారణంగా పెరిగింది. అవినీతి ఆరోపణలతోపాటు నియంతృత్వపాలన ప్రధాన కారణం కావచ్చు. హత్యలు, లూటీలు, కొన్ని దేవాలయాలపై దాడులు, ముజిబుర్ రహ్మాన్ విగ్రహ విధ్వంసం, ఇవన్నీ యాదృచ్ఛికం కావు. ముజీబ్ హత్యపై సినిమా తీసినందుకు ఒక సుప్రసిద్ధ హీరో తండ్రిని దారుణంగా హత్య చేసారు.

ఈ ఘటనలవెనక ఇస్లామ్ మత సంస్థ జమాయత్ వుండే అవకాశం ఉంది. వారివెనుక సిఐఎ ఉందని ఆరోపణలు వస్తున్నాయి. హసీనా అమెరికా వ్యతిరేక వైఖరి వారికి నచ్చలేదు. ఇంకా అనేక విషయాలు బయటకు రావాలి.

మోదీ ప్రభుత్వం, అజిత్ దోవల్, విదేశాంగ మంత్రి జైశంకర్ ఈ పరిణామాలు ఊహించడంలో ఘోరవైఫల్యం చెందారు. హసీనాకు సరైన హెచ్చరిక చేయడంలో విఫలమయ్యారు. ఇరుగుపొరుగులో భారత్ స్నేహం గా ఉన్న ఏకైక దేశం బంగ్లాదేశ్. దిక్కుతోచని స్థితిలో మొదటిసారి అఖిలపక్ష సమావేశం జరిపి చర్చించారు. అదొక సానుకూల పరిణామం. ఇంకా అనేక విషయాలు బయటకు రావలసి ఉంది. ఆందోళనకారుల్లో విద్యార్థులు జమైత్ వేరువేరా? కలసి చేసారా? బహిర్గతం కావాలి. బంగ్లాదేశ్ మతోన్మాదం పెరిగిపోతున్నది. ఇది మన దేశానికి ప్రమాదకరం. దేశం అష్టదిగ్బంధనంలో ఉందనిపిస్తుంది.

ఖలిదా జియా, మిలటరి పాలకుడు జియా సతీమణి. ఆయన హత్య చేయబడ్డ తర్వాత ఆమె అధికారంలోకి వచ్చింది. ఇస్లామిక్ మతోన్మాద సంస్థ జమాయతీ ఇస్లామీ ఆమెకు మద్దతు. జమాయతీ సంస్థకు యాభైవేలమంది పూర్తికాలం పనిచేసే పెయిడ్ హోల్ టైమర్లు వున్నారని వర్కర్స్ పార్టీ నాయకులు మాతో చెప్పారు.

హసీనా ఆ సంస్థను నిషేధించింది. బంగ్లాదేశ్ మతం ప్రాధాన్యత, అసాధారణంగా పెరిగిపోతున్నది. బంగ్లాదేశ్ ఇప్పటికీ కోటి ముప్పయి లక్షలమంది హిందువులున్నారు. కొన్ని లూటీలు జరిగినా విద్యార్థి నాయకులు గత రెండు రోజులుగా హిందువుల ఇళ్లపై దాడి జరగకుండా కాపలా కాస్తున్నారని వార్తలు కొంత సానుకూల వాతావరణం కలగజేస్తుంది.

ఈ సందర్భంలో మన విదేశాంగ విధానం గురించి పునరాలోచించాల్సిన అవసరం ఉంది. హసీనా దేశం విడిచి పారిపోయివస్తే, ఆమెకు ఆశ్రయం తాత్కాలికంగా కలిగించడం సరైందే ఐనా, భారత సెక్యూరిటీ అత్యున్నత అధికారి అజిత్ దోవల్ ఆమెకు స్వాగతం చెప్పటం, అది మీడియాలో ప్రచారం కావటం అర్ధం లేనిది. ఇది బంగ్లాదేశ్ భారత్ మరింత వ్యతిరేకతకు దారితీస్తుంది. దేశాలమధ్య సంబంధాలు సున్నితమైనవి. మన ఇరుగుపొరుగులో ఎవరు అధికారంలో ఉన్నా ఆ దేశాలతో సంబంధాలు కొనసాగాలి. ఏ పార్టీ, లేక ఏ నాయకుడిపట్ల సానుకూలత ఆ దేశాలతో సంబంధాలకు అడ్డుకాకూడదు.

 గతంలో భారత విదేశాంగ విధానం అన్ని పార్టీలు అంగీకరించిన జాతీయ విధానంగా ఉండేది. మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది మారింది. గతంలో పాకిస్తాన్ తప్ప అన్ని పొరుగు దేశాలతో సత్సంబంధాలు వుండేవి. ఇప్పుడు అవన్నీ దూరమయ్యాయి. అలీన దేశాలకు నాయకురాలిగా భారత్ గర్వకారణమైన ప్రాత నిర్వహించింది. మోదీ వ్యక్తిగత ధోరణులు, విశ్వగురువుగా ప్రకటించుకోవటం, మన దేశాన్ని ఒంటరిచేసింది.

మోదీ విదేశీ పర్యటనల్లో దేశాల మధ్య సంబంధాల కన్నా, తన ఆశ్రిత కార్పొరేట్లకు సహాయం చేసే ప్రయత్నంలో ఫ్రెంచి అధ్యక్షుడితో అనిల్ అంబానీకి సహాయం చేయమని మోదీ కోరినట్లు వెల్లడి కావటం, ఆస్ట్రేలియాలో అదానీకి బొగ్గుగనులు ఇప్పిస్తే ప్రజాం

దోళన జరగటంతో భారత ప్రతిష్ట దిగజారింది.

నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి విదేశాంగ విధానం వ్యక్తిగత స్థాయికి దిగజారింది. గత పర్యాయం అమెరికా అధ్యక్ష ఎన్నికలలో అనవసరంగా వేలుబెట్టి, “అబ్ కీ బార్ ట్రంప్ అని నినాదం ఇచ్చి అభాసుపాలయ్యారు. బైడన్ అధ్యక్షుడయ్యాడు. భారతీయులలో ఎక్కువ మంది డెమాక్రటిక్ పార్టీకి ఓట్లు వేశారు.

మోదీ శ్రీలంకలో మహేంద్ర రాజపక్షను తన స్నేహితుడని ప్రకటించుకున్నాడు. అతనిని ప్రజలు దేశం నుండి వెళ్లగొట్టారు. ప్రస్తుత అధ్యక్షుడు బహిరంగంగా చైనా అనుకూల వైఖరి తీసుకుంటున్నారు.

మన ఇరుగుపొరుగు దేశాలలో ఏ ఒక్కరితో సంబంధాలు బాగా లేవు. చైనాతో సరిహద్దు తగాదాయేగాక ఇతర సమస్యలున్నాయి. పాకిస్తాన్ తీవ్రమైన ఆర్థిక సంక్షోభంతో, ద్రవ్యోల్బణం, ధరల పెరుగుదలతో సతమతమౌతున్నది. మోదీ ప్రభుత్వం కాశ్మీర్ 370 అధికరణాన్ని రద్దుచేయడాన్ని ఒక ఆయుధంగా ప్రజల దృష్టిని మళ్లించడానికి పాక్ సైన్యం ప్రయత్నిస్తున్నది. ప్రజల్లో మద్దతు వున్న ఇమ్రాన్

ఖాన్ జైల్లో పెట్టింది.

బర్మాలో మిలటరీ నియంతృత్వం పట్ల ప్రజల్లో ఆగ్రహం పెరుగుతున్నది. సాయుధ తిరుగుబాటుదళాలు సైన్యంతో ఘర్షణలు పడుతూ, అనేక ప్రాంతాల్లో ఆధిపత్యం సంపాదిస్తున్నవి. వేలాది మంది బర్మా సైనికులు పారిపోయి భారతదేశంలో తలదాచుకున్నా రు. ఆఫ్ఘనిస్తాన్ మతోన్మాద తాలిబాన్లు నిరంకుశ పాలన సాగిస్తూ, భారత వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు.

నేపాలీలోని ఓలీ ప్రభుత్వానికి భారత్ సత్సంబంధాలులేవు. ఆ ప్రభుత్వాన్ని బలపరుస్తున్న నేపాలీ కాంగ్రెసు భారత్ సానుకూలంగా వుంటే, ప్రధాని శర్మ ఓలి చైనా అనుకూలుడని ప్రచారం జరుగుతున్నది. భారతదేశం భుజాలమీద తుపాకి పెట్టి అమెరికా చైనాకు వ్యతిరేకంగా మనలను ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తున్నది. మారిషస్ ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన నూతన ప్రభు త్వం, అక్కడి నుండి భారత సెక్యూరిటీ దళాలను, వెళ్లిపొమ్మని అల్టిమేటం ఇచ్చాయి. చైనాతో సానుకూల సంబంధాలు పెట్టుకున్నారు.

మనచుట్టూ ఉన్న దేశాలు మనకంటే, భౌగోళికంగా, సైనిక రీత్యా చిన్నవే. కాని చైనా చాలా బలవత్తరమైన దేశం. ఇరుగుపొరుగుతో మంచి సంబంధాలు మన విదేశాంగ విధాన ప్రధాన సూత్రంగా వుండాలి.

చుట్టూ వున్న దేశాలు రాజకీయ ఆర్థిక సంక్షోభాలలో వున్నాయి. వారికి తగిన సహాయం చేయటం, వారి ఆంతరంగిక వ్యవహారాల నుండి దూరంగా వుండటం, ప్రస్తుతానికి విదేశాంగ నీతిగా వుండాలి. ప్రతిపక్షాలను, మేధావులను విశ్వాసంలోకి తీసుకోవాలి.

ఎన్నికలలో ఏదోరకంగా గెలిచినంత మాత్రాన, ప్రజలను అణచివేసే నియంతృత్వ చట్టాలు, ధోరణులు కొనసాగితే ప్రజలు తిరుగుబాటు బాట పడతారని బంగ్లాదేశ్ ఆందోళన నుండి గుణపాఠం మన పాలకులు నేర్చుకోవాలి.

コメント


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page