top of page
MediaFx

భక్తుల భద్రత కోసం రామ జన్మభూమి ఆలయంలో మొబైల్ ఫోన్ల నిషేధం

రామజన్మభూమి ఆలయ ప్రాంగణంలో మొబైల్ ఫోన్ల వినియోగాన్ని నిషేధించాలని శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం, అయోధ్య పరిపాలనా యంత్రాంగం నిర్ణయించింది. భక్తుల భద్రత, సౌకర్యాలను మెరుగుపరచడమే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆలయ ధర్మకర్త అనిల్ మిశ్రా తెలిపారు. భక్తులందరూ ఈ నిర్ణయాన్ని గౌరవించాలని, క్లోక్‌రూమ్‌ సౌకర్యాలు, ఏర్పాట్ల నిర్వహణకు సహకరించాలని ధర్మకర్త విజ్ఞప్తి చేశారు. మొబైల్ ఫోన్‌లు, ఇతర విలువైన వస్తువులను భద్రంగా ఉంచుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నామని చెప్పారు. భక్తులు ఈ సౌకర్యాలను వినియోగించుకుని నిర్వహణ సిబ్బందికి సహకరించాలని కోరారు. సాంప్రదాయ నాగర శైలిలో నిర్మించిన రామజన్మభూమి ఆలయం 2.7 ఎకరాల విస్తీర్ణంలో 161 అడుగుల ఎత్తులో ఉంది. మూడు అంతస్తుల నిర్మాణం 380 అడుగుల పొడవు, 250 అడుగుల వెడల్పుతో 392 స్తంభాలు, 44 తలుపులు కలిగి ఉంది. ఆలయంలో ఐదు ప్రధాన మందిరాలు ఉన్నాయి. అందులో నృత్య మండపం, రంగ మండపం, సభా మండపం, ప్రార్థన మండపం, కీర్తన మండపం. ఆలయ గోడలు, స్తంభాలు హిందూ దేవతలను వర్ణించే క్లిష్టమైన శిల్పాలతో అలంకరించబడ్డాయి.

bottom of page