top of page

ఆగస్ట్ 9 – అదే కథ అదే జాతర..


కల్కి 2898 ఏడు బ్లాక్ బస్టర్ తర్వాత ప్రతి శుక్రవారం కొత్త సినిమాలు రావడం ఉసురుమనిపించడం పరిపాటిగా మారిపోయింది. నెంబర్ పరంగా చెప్పుకోవడానికి కౌంట్ అయితే కనిపిస్తోంది కానీ అవి థియేటర్ల దగ్గర కలెక్షన్లుగా మారడం లేదు. భారతీయుడు 2 లాంటి ప్యాన్ ఇండియా మూవీ అయినా డార్లింగ్ లాంటి లో బడ్జెట్ చిత్రమైనా బయ్యర్ల ఎదురు చూపులు తీరడం లేదు. ఆగస్ట్ 15 మంచి రసవత్తరమైన పోటీ ఉన్న నేపథ్యంలో దాని కన్నా ముందు వచ్చే ఆగస్ట్ 9న చిన్న సినిమా జాతర జరగనుంది. నీహారిక కొణిదెల నిర్మాత కావడం వల్ల ‘కమిటీ కుర్రోళ్ళు’ అంతో ఇంతో ప్రేక్షకుల దృష్టిలో పడింది.


ముందు రోజు ప్రీమియర్లు వేస్తున్నారు కానీ దీనికి భీభత్సమైన హైప్ ఏమి లేదు. పదకొండు మంది కొత్త కుర్రాళ్ళని పరిచయం చేస్తున్నారు. పెదనాన్న చిరంజీవి కూడా ప్రమోషన్ కోసం వీడియో బైట్ ఇచ్చారు. విజయ్ ఆంటోనీ డబ్బింగ్ మూవీ ‘తుఫాన్’ తమిళం కంటే వారం ఆలస్యంగా తెలుగులోకి తీసుకొస్తున్నారు. అక్కడ యావరేజ్ ఫలితమే దక్కింది కనక ఇక్కడేమవుతుందో చెప్పలేం. అనసూయ జగపతిబాబు ప్రధాన పాత్రలు పోషించిన ‘సింబ’తో ఏదో సోషల్ మెసేజ్ చెప్పే [ప్రయత్నం చేస్తున్నారు. కమర్షియల్ అంశాలు కూడా ఉంటాయట. జనాన్ని రప్పించడం సవాలే.


ఇవి కాకుండా కమెడియన్లు ప్రధాన పాత్రలు పోషించిన ‘భవనమ్’ని సూపర్ గుడ్ ఫిలింస్ లాంటి పెద్ద సంస్థ తీసుకొస్తోంది. ఓటిటిలో అందుబాటులో ఉన్న విజయ్ సేతుపతి ‘సూపర్ డీలక్స్’ని ఇప్పుడు మళ్ళీ విడుదల చేస్తున్నారు. ఇవి కాకుండా పాగల్ వర్సెస్ కాదల్, ల్యాండ్ మాఫియా, సంఘర్షణ. కేస్ నెంబర్ 15 కూడా రేసులో ఉన్నాయి. ఏదో మొక్కుబడి రిలీజ్ తప్ప మార్నింగ్ షోకి సగం హాలు నిండినా గొప్పే వీటికి. అనూహ్యమైన టాక్ వస్తే కనీసం సోషల్ మీడియాలో ఊపు కనిపిస్తుంది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మురారి ఊహించని స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ తోనే ఊచకోత చేయడం కొసమెరుపు.

Comments


మీ కోసం IndiaFx సేకరణ...

Related Products

bottom of page