top of page
MediaFx

ఎవరు గెలిచినా మరొకరి మనుగడ ప్రశ్నార్థకం..!

అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా వైఎస్సార్సీపీ, టీడీపీ కూటమి హోరాహోరీగా పోరాడాయి. అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి గెలవడం కోసం తీవ్రంగా పోరాటం చేయగా.. మరోవైపు టీడీపీ కూటమి ఈసారి ఎలాగైనా గెలవాలనే పట్టుదలలో పోరాటం చేసింది. పార్టీలు ప్రచారంతో హోరెత్తించడం.. అదే రీతిలో ఓటర్లు పోలింగ్ స్టేషన్లకు పోటెత్తడంతో భారీ స్థాయిలో పోలింగ్ నమోదైంది. ఈసారి ఎగ్జిట్ పోల్స్ ముగిసిన తర్వాత కూడా గెలుపెవరిదనే విషయంలో స్పష్టత రాలేదు. కొన్ని ఎగ్జిట్ పోల్స్ జగన్ పార్టీకి జైకొట్టగా.. మరికొన్ని ఎన్డీయే హవా ఉందని చెప్పడమే దీనికి కారణం. ఈ ఎన్నికల్లో ఏ పార్టీ గెలిచినా.. ఓడిపోయిన మరో పార్టీకి ఇబ్బందికర పరిస్థితులు తప్పేలా లేవు. ఒకవేళ వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చింది అనుకుంటే.. టీడీపీకి నాయకత్వ సమస్యలు చుట్టుముట్టే అవకాశాలున్నాయి. ప్రస్తుతం చంద్రబాబు నాయుడి వయసు 74 ఏళ్లు.

ఒకవేళ టీడీపీ ఓడితే.. మరో ఐదేళ్ల తర్వాత చంద్రబాబు ఇంతే యాక్టివ్‌గా ఉంటారని అనుకోలేం. చంద్రబాబు నాయుడు గనుక యాక్టివ్‌గా లేకపోతే.. నారా లోకేశ్‌ నాయకత్వం కింద పని చేసే విషయంలో పార్టీలో అంతర్గత విబేధాలు తలెత్తే అవకాశాలు లేకపోలేదు. ఆ మధ్య పార్టీ లేదు బొక్కా లేదంటూ.. టీడీపీ సీనియర్ నేత చేసిన వ్యాఖ్యలను మర్చిపోవద్దు. టీడీపీ స్థానాన్ని ఆక్రమించుకోవడానికి దాని మిత్రపక్షాలైనా బీజేపీ, జనసేనలు ప్రయత్నించినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఏపీ ఎన్నికల్లో టీడీపీ గెలిచి వైఎస్సార్సీపీ ఓడితే.. జగన్ పార్టీకి తెలుగుదేశానికి మించిన ఇబ్బందులు తప్పవు. జగన్‌పై అక్రమాస్తుల కేసులు ఉండటం, గతంలో ఆయన జైలుకెళ్లొచ్చిన నేపథ్యంలో.. మరోసారి ఆయన జైలుకు వెళ్లాల్సిన వచ్చినా ఆశ్చర్యం లేదు. అదే జరిగితే పార్టీలో అంతర్గత పోరు తలెత్తే ప్రమాదం లేకపోలేదు. గతంలో జగన్ జైలుకు వెళ్లినప్పుడు షర్మిల పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లారు. ఇప్పుడామె పీసీసీ చీఫ్‌గా ఉన్నారు.

ఏపీలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలనే లక్ష్యంతో పని చేస్తున్న షర్మిల.. ఏమాత్రం ఛాన్స్ దొరికినా వైఎస్సార్సీపీలోని ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకత్వాన్ని తమ వైపు తిప్పుకునేందుకు రెడీగా ఉంటారు. 2014కు ముందు వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు బ్యాంకుగా ఉన్న వర్గాలన్నీ.. జగన్ పార్టీ పెట్టిన తర్వాత అటు వైపు మళ్లిన సంగతి తెలిసిందే. స్థూలంగా చెప్పాలంటే 2024 ఎన్నికల్లో ఓడిపోయిన పార్టీకి.. వచ్చే ఐదేళ్లపాటు రకరకాల ఒడిదొడుకులను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఓడిన పార్టీ అంతర్గత సమస్యల పరిష్కారానికి.. బయటి నుంచి పార్టీని బలహీన పరిచే ప్రయత్నాలను తిప్పికొట్టేందుకు ఎక్కువ సమయం కేటాయించాల్సి రావచ్చు. ఎందుకంటే ఓడిన పార్టీని బలహీన పర్చడానికి, కుదిరితే లేకుండా చేయడానికి అధికారంలోకి వచ్చిన పార్టీ అన్ని రకాల ప్రయత్నాలు సాగించొచ్చు. తమకు స్పేస్ వస్తుందనే ఆశతో.. బీజేపీ, కాంగ్రెస్, జనసేన లాంటి పార్టీలు సైలెంట్‌గా ఉంటూ.. ఈ పరిణామాలను తమకు అనుకూలంగా మలుచుకునే అవకాశాలున్నాయి.

bottom of page