చైనాలో మరో కొత్త రకం వైరస్ బయటపడింది. వెట్‌ల్యాండ్ (WELV) అని పిలవబడే అత్యంత ప్రమాదకరమైన వైరస్‌ను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. మెదడు, నాడీ సంబంధిత వ్యాధులకు ఇది కారణమవుతుందని గుర్తించారు.ఈ వెట్‌ల్యాండ్ వైరస్‌ను తొలుత 2019లో గుర్తించారు. మంగోలియాలోని చిత్తడి నేలకు చెందిన ఓ 61 ఏళ్ల వృద్ధుడు అప్పట్లో అనారోగ్యానికి గురయ్యాడు. ఐదు రోజుల పాటు జ్వరం, తలనొప్పి, వాంతులు వంటి లక్షణాలు కనిపించాయి. ఈ లక్షణాలు కాస్త అనుమానాస్పదంగా ఉండటంతో పరిశోధకులు అప్రమత్తమయ్యారు. సమీప ప్రాంతాల్లోని దాదాపు 14,600 జీవులను సేకరించి అధ్యయనం చేశారు. వీటిలో దాదాపు రెండు శాతం పరాన్న జీవుల్లో (WELV) జన్యు పదార్థం ఉన్నట్లు గుర్తించారు.
అలాగే మంగోలియా ప్రాంతంలోని 640 మంది అటవీ అధికారుల రక్త నమూనాలను సేకరించి పరిశోధకులు విశ్లేషించారు. అందులో 12 మందిలో ఈ రకమైన వైరస్ ఉన్నట్లు తేలింది. జ్వరం, మైకం, తలనొప్పి, వికారం, విరేచనాలు వంటి లక్షణాలను వారిలో గుర్తించారు. వీరిలో మెదడు, వెన్నెముక ద్రవంలో అధిక తెల్ల రక్త కణాల సంఖ్య కారణంగా ఒక రోగి కోమాలోకి వెళ్లాడు. అయితే చికిత్స తర్వాత వీరంతా కోలుకున్నారు. కానీ ఎలుకలపై ల్యాబ్‌ల్లో చేసిన ప్రయోగాల్లో WELV ప్రాణాంతకమైన ఇన్‌ఫెక్షన్లకు కారణమవుతుందని గుర్తించారు. ముఖ్యంగా మెదడు, నాడీ సంబంధిత అనారోగ్య సమస్యలు వస్తున్నాయని కనుగొన్నారు. తాజాగా ఈ అధ్యయానికి సంబంధించిన నివేదికను ది న్యూ ఇంగ్లండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురితమైంది.
వెట్‌ల్యాండ్ (WELV ) వైరస్ అనేది క్రిమియన్ కాంగో హెమరేజిక్ ఫీవర్ గ్రూప్‌నకు చెందిన వైరస్. ఇది పరాన్న జీవుల ద్వారా వ్యాపిస్తుంది. పందులు, గొర్రెలు, గుర్రాల్లోనూ ఆర్‌ఎన్‌ఏ ఇది వరకే ఉన్నట్లు గుర్తించారు.