తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజుల నుంచి వర్షాలు దంచికొడుతున్నాయి. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.. ఈ క్రమంలోనే.. వాతావరణశాఖ అలర్ట్ జారీ చేసింది.. మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఆవర్తన ద్రోణి ప్రభావంతో ఈ నెల 22 వరకు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది.
తెలంగాణలో మరో మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.. ఈ మేరకు పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.. కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది..
తెలంగాణలో 7 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల, నారాయణపేట, వికారాబాద్, సంగారెడ్డి జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.. మిగతా చోట్ల కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
ఏపీలో కూడా వర్షాలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో వాతావరణ శాఖ పలు జిల్లాలకు రెయిన్ అలర్ట్ జారీ చేసింది.. శనివారం పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్య సాయి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది.
శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, వైయస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని.. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది.