top of page

ఏపీలో ఇంటింటికీ రేషన్ బంద్..?

ఏపీలో అధికారంలోకి వచ్చిన ఏన్డీఏ కూటమి గత ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయాలకు స్వస్తి చెబుతోంది. ఇప్పటికే జగన్ ప్రభుత్వంలో జీవోలను పరిశీలించి వాటిని రద్దు చేయడం జరిగింది.రాష్ట్రంలో పలు విభాగాల్లో రిటైర్డ్ ఉద్యోగుల సేవలను కొనసాగిస్తూ గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను చంద్రబాబు రద్దు చేశారు. ఇలాంటి సిబ్బందిని వెంటనే తొలగించాలని సీఎస్‌ను ఆదేశించారు. ఇలాంటి వారిని తొలగించి దీనిపై ఓ నివేదిక అందజేయాలని సంబంధిత అధికారులను చంద్రబాబు కోరారు.

వైఎస్ఆర్ బీమాగా ఉన్న పథకాన్ని చంద్రన్న బీమాగా మారుస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. పైగా బీమా పథకం సొమ్మును రూ.3 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచుతున్నట్టు టీడీపీ ప్రభుత్వం ప్రకటించారు. ఇదిలా ఉంటే తాజాగా టీడీపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం అమలు చేసిన ఇంటింటికి రేషన్ అందించే కార్యక్రమానికి ప్రభుత్వం స్వస్తి పలికింది.

దీనిపై గిరిజన సంక్షేమ, మహిళా శిశు సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి కీలక నిర్ణయం తీసుకున్నారు. గిరిజన సంక్షేమ శాఖ అధికారులతో సమావేశమైన మంత్రి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీనిలో భాగంగానే ఏపీలో ఇంటింటికీ రేషన్ పథకానికి ముగింపు పలకాలని ఆమె ఆదేశించారు.ఇకపై వారు రేషన్ షాపుల ద్వారా మాత్రమే రేషన్ పంపిణీ చేస్తామని తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో డీఎంయూ వాహనాల ద్వారా రేషన్ పంపిణీ కార్యక్రమాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.

అయితే కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఇంటింటికీ రేషన్ పథకం అమలు చేయడానికి ప్రభుత్వం సుముఖత వ్యక్తం చేసింది. ప్రస్తుతం డీఎంయూ వాహనాల ద్వారా ఇస్తున్న రేషన్ విధానాన్ని రద్దు చేసి.. గిరిజన్ ప్రాంతాల్లో 960 రేషన్ షాపులను పునరుద్ధరిస్తామని మంత్రి పేర్కొన్నారు.గిరిజన ప్రాంతాల్లో గిరిజన వసతిగృహాల్లో ANMలు, ఫీడర్ అంబులెన్స్‌లు, తల్లీబిడ్డ ఎక్స్‌ప్రెస్ వాహనాలను త్వరలోనే తీసుకువస్తామని మంత్రి గుమ్మడి సంధ్యారాణి హామీ ఇచ్చారు.

bottom of page