తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంటికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కాసేపటి క్రితమే చేరుకున్నారు. గన్నవరం ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకున్న సీఎం జగన్. అక్కడి నుంచి నేరుగా బంజారాహిల్స్‌లోని కేసీఆర్ ఇంటికి చేరుకున్నారు.
గత నెల 7వ తేదీన ఫాం హౌజ్‌లో కింద పడడంతో కేసీఆర్ తుంటి ఎముకకు గాయమైన నేపథ్యంలో జగన్ ఆయనను పరామర్శించారు. జగన్ పరామర్శ తర్వాత ఇద్దరు నాయకులు కలిసి భోజనం చేయనున్నారు. లంచ్ ముగిసిన తర్వాత ఈ ఇద్దరు నేతల రాజకీయ పరిణామాలపై చర్చించే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదిలా ఉంటే కేసీఆర్‌కు డిసెంబర్ 8వ తేదీన తుంటి మార్పిడి సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే.
8 రోజుల పాటు యశోద ఆసుపత్రిలో చికిత్స అనంతరం కేసీఆర్ హైదరాబాద్‌లోని తన ఇంటికి వెళ్లారు. ప్రస్తుతం కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం మెరుగ్గా ఉన్నట్లు బీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి. సీఎం జగన్ రాక సందర్భంగా బీఆర్‌ఎస్ పార్టీకి చెందిన ప్రముఖ నాయకులు కేసీఆర్ ఇంటికి చేరుకున్నారు. అయితే కేవలం కొంత మంది నాయకులను మాత్రమే అనుమతించారు.
బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వయంగా పుష్పగుచ్చం అందించి జగన్‌కు స్వాగతం పలికారు. భోజనం అనంతరం జగన్, కేసీఆర్‌ల మధ్య గంట పాటు చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఏపీలో ప్రస్తుతం మారిన రాజకీయాలపై ఇద్దరు నాయకుల మధ్య చర్చ జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.🤝👥