top of page
MediaFx

కూటమి పార్టీల్లో భగ్గుమన్న విభేదాలు..


ఆంధ్రప్రదేశ్‌లో మూడు పార్టీల పొత్తుతో ఎన్నికల్లోకి వెళ్తున్న కూటమిలో రచ్చ మొదలైంది. ఎవరికి వారే ఆధిపత్యం కోసం ప్రయత్నిస్తున్నారు. ఏకంగా ప్రచార సమయంలోనే వీరి మధ్య రగడ బయట పడిపోతోంది. కూటమిలో కుమ్ములాటలు మొదలయ్యాయి. టీడీపీలోనే వర్గపోరు కొనసాగుతుంటే, అటు తెలుగుదేశం, బీజేపీ, జనసేన మధ్య కూడా ఆధిపత్యపోరు నడుస్తోంది. కొన్నిచోట్ల జనసేన ప్రచారానికి రావొద్దంటూ టీడీపీ నేతలు హుకుం జారీ చేస్తున్నారు.

నంద్యాల జిల్లాలో కోట్ల వర్గం, ధర్మవరం సుబ్బారెడ్డి వర్గం మధ్య నువ్వా..నేనా? అనే రీతిలో ఆధిపత్యపోరు నడుస్తోంది. ప్యాపిలి మండలం పెద్ద పూజర్లలో ఏకంగా రాళ్లతో దాడి చేసుకునే వరకు వెళ్లింది వ్యవహారం. ప్రసాద్ వర్గం, తప్పెల శీను వర్గాలుగా విడిపోయి కట్టెలతో రాళ్లతో దాడి చేసుకున్నారు. టీడీపీ అభ్యర్థి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డికి మా వర్గం ముందు దండ వెయ్యాలి అంటే, మా వర్గం ముందు దండ వేయాలి అని ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఎంత సముదాయించినా ఎవరూ వినకపోవడంతో దీన్ని తట్టుకోలేక కోట్ల సూర్య ప్రకాష్‌ రెడ్డి కారు ఎక్కి అక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోవాల్సి వచ్చింది.

విశాఖపట్నం జిల్లా భీమిలి నియోజకవర్గంలో జనసేన పార్టీ నేతలకు ఘోర అవమానం ఎదురైంది. టీడీపీ ప్రచార రథంపై నుంచి జనసేన నేతలను బలవంతంగా గెంటేశారు. గల్లాలు పట్టి కిందకు లాగేశారు టీడీపీ నేతలు. టీడీపీ ప్రచార రథంపై జనసేన జెండాలు లేకుండా ప్రచారం చేయడాన్ని జనసేన పార్టీ శ్రేణులు ప్రశ్నించాయి. దీంతో ఆగ్రహించిన టీడీపీ నేతలు, జనసేన నేతలను, ఆపార్టీ జెండాలు పట్టుకుని ప్రచార రథం ఎక్కిన వారిని బలవంతంగా దించేశారు. ప్రచార రథం దిగిపోవాలని హెచ్చరించారు.

దెందులూరు మాజీ ఎమ్మెల్యే, ఇప్పుడు అదే నియోజకవర్గం నుంచి టీడీపీ తరపున బరిలో నిలిచిన చింతమనేని ప్రభాకర్‌ కూడా జనసేన పార్టీ నేతలపై అసహనం వ్యక్తం చేశారు. తమతో కలిసి ప్రచారానికి వస్తే రండి..లేదంటే వద్దు అని కామెంట్‌ చేశారు. దీంతో అటు పోలింగ్‌ తేదీ దగ్గర పడుతున్న వేళ కూటమిలో కుమ్ములాటలు మూడు పార్టీల అగ్రనేతలకు తలనొప్పిగా తయారయ్యాయి.


bottom of page