top of page
MediaFx

ఒలింపిక్స్‌లో అదరగొట్టిన అమన్ సెహ్రావత్.. పీవీ సింధు ఎనిమిదేళ్ల రికార్డు బ్రేక్


ప్యారిస్ ఒలింపిక్స్ 2024లో భారత్ అథ్లెట్స్ పుంజుకుంటున్నారు. దీంతో పతకాల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం రాత్రి జరిగిన రెజ్లింగ్ 57కిలోల విభాగంలో అమన్ సెహ్రావత్ అదరగొట్టాడు. 13-5తో దరియన్ టోయ్ క్రజ్ (ప్యూర్టోరికో)ను ఓడించి కాంస్య పతకాన్ని గెలుచుకున్నాడు. దీంతో ఒలింపిక్స్ లో భారత్ పతకాల సంఖ్య ఆరుకు చేరుకుంది. ఈ ఒలింపిక్స్ లో ఇండియా తరపున పోటీపడిన ఏకైక పురుష రెజ్లర్ అమన్ కావడం విశేషం. సెమీస్ లో భంగపాటు ఎదురైనా.. కాంస్య పతక పోరులో ప్రత్యర్థిపై సాధికారిక విజయం సాధించాడు. కాంస్య పతకం గెలుచుకున్న అనంతరం అమన్ మాట్లాడుతూ.. నేను రెజ్లర్ ను కావాలని నా తల్లిందండ్రులు కోరుకున్నారు. వాళ్లకు ఒలింపిక్స్ గురించి తెలియదు. కానీ నన్నో విజేతగా చూడాలనుకున్నారు. నా పతకాన్ని మా అమ్మానాన్నలకు, దేశానికి అంకితమిస్తున్నాను అని అమన్ సెహ్రావత్ అన్నారు. రెజ్లింగ్ లో కాంస్య పతకం సాధించిన అమన్ సెహ్రావత్ సరికొత్త రికార్డును నెలకొల్పాడు. గతంలో బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ పీవీ సింధూ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. ఒలింపిక్స్ లో వ్యక్తిగత పతకం గెలిచిన అతి పిన్న వయస్సు కలిగిన భారత అథ్లెట్ గా అమన్ నిలిచాడు. 2016లో పీవీ సింధు రజతం గెలిచినప్పుడు ఆమెకు 21ఏళ్ల 1నె 14రోజులు. ప్రస్తుతం అమన్ వయస్సు 21ఏళ్ల 24 రోజులు. దీంతో పీవీ సింధూ నెలకొల్పిన రికార్డును అమన్ సెహ్రావత్ బ్రేక్ చేసినట్లయింది. ఒలింపిక్స్ పోటీల్లో భాగంగా రెజ్లింగ్ విభాగంలో 2008 నుంచి క్రమం తప్పకుండా భారత్ అథ్లెట్స్ పతకాలు సాధిస్తున్నారు. ఈ ఆనవాయితీని పారిస్ ఒలింపిక్స్ 2024లో అమన్ సెహ్రావత్ కొనసాగించాడు. 2008లో సుశీల్ కాంస్య పతకం నెగ్గగా, 2012లో రజతం గెలుచుకున్నాడు. అదవిధంగా 2012లో యోగేశ్వర్ దత్ కాంస్యం గెలుచుకోగా.. 2016లో సాక్షి మాలిక్ కాంస్య పతకం గెలిచింది. 2020లో రవి దహియా రజతం గెలుచుకోగా.. 2020లో ఒలింపిక్స్ లోనే బజ్ రంగ్ కూడా కాంస్యం గెలుచుకుంది. తద్వారా ఆనవాయితీ కొనసాగుతూ వస్తోంది. తాజాగా అమన్ సెహ్రావత్ రెజ్లింగ్ విభాగంలో కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. వీరికంటే ముందు 1952లో కేడీ జాదవ్ రెజ్లింగ్ లో కాంస్య పతకం సాధించాడు.

bottom of page