ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌తో అఖిలేష్ యాదవ్ భేటీ అయ్యారు. బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు వచ్చిన అఖిలేష్‌కు తలసాని శాలుగా కప్పగా.. మంత్రి ప్రశాంత్ రెడ్డి పుష్పగుచ్చం ఇచ్చి స్వాగతం పలికారు.
తెలంగాణ సీఎం కేసీఆర్‌తో ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ సమావేశమయ్యారు. ఇవాళ మధ్యాహ్నం ప్రగతిభవన్‌లో ఇరువురు లంచ్ భేటీ అయ్యారు. యూపీ నుంచి బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న అఖిలేష్‌కు మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రులతో కలిసి అఖిలేష్ నేరుగా ప్రగతిభవన్‌కు చేరుకోగా.. సీఎం కేసీఆర్ ఆయనకు స్వాగతం పలికారు. ఇటీవల పాట్నాలో విపక్షాల భేటీ జరగడం, మరో ఏడాదిలో లోక్‌సభ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో అఖిలేష్, కేసీఆర్ భేటీపై రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది. ఖమ్మంలో ఆదివారం టీ కాంగ్రెస్ నిర్వహించిన జనగర్జన సభలో బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ అంటూ వ్యాఖ్యలు చేసిన క్రమంలో ఈ భేటీ కీలకంగా మారింది. జాతీయ రాజకీయాల్లో ఎలా ముందుకెళ్లాలనే దానిపై ఇరువురు చర్చించే అవకాశముందని తెలుస్తోంది. బీజేపీ వ్యతిరేక కూటమిలో ప్రస్తుతం అఖిలేష్ యాదవ్ కొనసాగుతున్నారు. దీంతో బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్‌తో సంబంధం లేకుండా స్వతంత్రంగా పనిచేస్తున్న కేసీఆర్‌తో అఖిలేష్ భేటీ చర్చనీయాంశంగా మారింది. ఈ భేటీలో ఎలాంటి అంశాలు చర్చిస్తారు? అనేది హాట్‌టాపిక్‌గా మారింది. త్వరలో తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు కూడా ఉండనున్న క్రమంలో రాష్ట్ర ఎన్నికల గురించి కేసీఆర్‌ను అడిగి అఖిలేష్ తెలుసుకునే అవకాశముందని తెలుస్తోంది. కేసీఆర్‌తో సమావేశం తర్వాత మంత్రి కేటీఆర్‌తో కూడా అఖిలేష్ సమావేశం కానున్నారు. అనంతరం సాయంత్రం 4.30 గంటలకు తిరిగి లక్నోకు అఖిలేష్ బయలుదేరనున్నారు. అయితే గతంలోనూ పలుమార్లు అఖిలేష్ యాదవ్, కేటీఆర్ భేటీ అయ్యారు. ఢిల్లీలో జరిగిన బీఆర్ఎస్ కార్యాలయం ప్రారంభోత్సవానికి కూడా అఖిలేష్ హాజరయ్యారు. ఆ తర్వాత మంత్రి కేటీఆర్‌తో కూడా పలుమార్లు అఖిలేష్ సమావేశమయ్యారు.