top of page
Suresh D

సిట్టింగ్ ఎంపీల్లో సగం మందిపై క్రిమినల్ కేసులు..


మరికొన్ని రోజుల్లో ముగియనున్న 17 వ లోక్‌సభలోని ఎంపీలు.. ఎన్నికల అఫిడవిట్‌లో భాగంగా దాఖలు చేసిన పత్రాల ఆధారంగా అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్-ఏడీఆర్ ఒక అధ్యయనం నిర్వహించింది. ఇందులో ప్రస్తుతం ఉన్న ఎంపీలలో ఎవరెవరిపై కేసులు ఉన్నాయి.. అందులో క్రిమినల్ కేసులు, తీవ్రమైన నేరాలు ఉన్నవి ఎన్ని.. ఇక ఎంపీల ఆస్తులు ఎన్ని అనే విషయాలను తాజాగా వెల్లడించింది. ప్రస్తుత లోక్‌సభలోని ఎంపీల్లో 44 శాతం మందిపై క్రిమినల్‌ కేసులు నమోదైనట్లు ఏడీఆర్‌ నివేదిక వెల్లడించింది. ఇక 5 శాతం మంది ఎంపీలు కోటీశ్వరులని.. వారి ఒక్కొక్కరి సంపద రూ.100 కోట్లకు పైగానే ఉంటుందని తెలిపింది.17 వ లోక్‌సభలోని 514 మంది సిట్టింగ్‌ ఎంపీలు.. ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్ల ఆధారంగా ఏడీఆర్ ఈ అధ్యయనం నిర్వహించింది. ఎన్నికల అఫిడవిట్లు దాఖలు చేసిన మొత్తం 514 మందిలో 225 మందిపై క్రిమినల్‌ కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. ఈమేరకు అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫార్మ్స్‌ అధ్యయనంలో వెల్లడైంది. ఈ నివేదిక ప్రకారం.. సిట్టింగ్ ఎంపీల్లోని 5 శాతం మంది కోటీశ్వరులు ఉన్నారని తెలుస్తోంది. ఈ 5 శాతం మంది ఎంపీల ఒక్కొక్కరి సంపద వంద కోట్లకు పైనే ఉంటుందని తెలిపింది.ఇక క్రిమినల్‌ కేసులు నమోదైన ఎంపీల్లో 29 శాతం మందిపై హత్య, హత్యాయత్నం, మత విద్వేషాలను రెచ్చగొట్టడం, కిడ్నాప్, మహిళలపై నేరాలకు పాల్పడటం లాంటి తీవ్రమైన కేసులు ఉన్నాయి. ఇందులో మొత్తం 9 మందిపై హత్య కేసులు నమోదు కాగా.. వారిలో అందులో ఐదుగురు అధికార బీజేపీ ఎంపీలే కావడం గమనార్హం. ఇక 28 మందిపై హత్యాయత్నం కేసులు నమోదైతే.. వారిలో 21 మంది బీజేపీకి చెందినవారే ఉన్నారు. మహిళలపై నేరాలకు సంబంధించి 16 కేసులు, 3 అత్యాచారం కేసులు నమోదు అయినట్లు ఆ నివేదిక వెల్లడించింది.

bottom of page