top of page
MediaFx

గణపతి ఊరేగింపుపై రాళ్లదాడి.. ఇరు వర్గాల మధ్య ఘర్షణ, 56 మంది అరెస్ట్‌


కర్ణాటకలోని మాండ్యలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకున్నది. గణపతి ఊరేగింపు (Ganpati Procession) సందర్భంగా రెండు వర్గాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. రాళ్లు రువ్వడం, విధ్వంసం సృష్టించడం వంటి ఘటనలతో పరిస్థితి అదుపు తప్పింది. నాగమంగళ పట్టణంలో గణేష్ విగ్రహ నిమజ్జనం కోసం బద్రికొప్పలు గ్రామానికి చెందిన కొందరు యువకులు ఊరేగింపు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో మైసూరు రోడ్డులోని దర్గా వద్ద రెండు వర్గాల యువకుల మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. కొందరు దుండగులు ఊరేగింపుపై రాళ్లు రువ్వడ్డంతో పరిస్థితి అదుపుతప్పింది. సమీపంలో ఉన్న షాపులను ధ్వంసం చేశారు. టైర్లను తగలబెట్టి రోడ్లపై పడేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు లాఠీచార్జి చేశారు. అల్లర్లుకు పాల్పడిన 52 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, గణేశుడి విగ్రహాన్ని తీసుకుని పోలీసు స్టేషన్‌ వద్ద యువకులు నిరసన వ్యక్తం చేశారు. ఏ తప్పూ చేయకుండానే తమవారిని అరెస్టు చేశారని ధర్నాకు దిగారు. వారిని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. అయితే విచారణ నిమిత్తం వారిని స్టేషన్‌కు తీసుకొచ్చామని, ఏ తప్పూ చేయకుండా ఉంటే వారిని వదిలేస్తామని పోలీసులు వెల్లడించారు. ముందుజాగ్రత్త చర్యగా ఆ ప్రాంతంలో బీఎన్‌ఎస్‌ఎస్‌ చట్టం సెక్షన్‌ 163 ప్రకారం నిషేధాజ్ఞలు విధించారు. ఈ ఘటనపై కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర స్పందించారు. ప్రస్తుతం పరిస్థితి అదుపులోనే ఉన్నదని చెప్పారు. ఇప్పటివరకు 52 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. గణేషుడి ఊరేగింపుపై కొందరు రాళ్లు రువ్వారని తెలిపారు. కాగా, గుజరాత్‌లోని సూరత్‌లోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకున్నది. అల్లరి మూకలు గణపతి మండపంపై రాళ్లు రువ్వారు. దీంతో ఆరుగురు మైనర్లను పోలీసులు అరెస్టు చేశారు.

bottom of page