top of page
Shiva YT

పదో తరగతి పరీక్షలకు హాజరుకానున్న 5.07 లక్షల విద్యార్ధులు..2700 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు 📚👩‍🎓

తెలంగాణ రాష్ట్రంలో 2023 – 24 విద్యాసంవత్సరానికి గానూ పదో తరగతి వార్షిక పరీక్షలు మార్చి నెలలో జరగనున్న సంగతి తెలిసిందే. పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు విద్యాశాఖ ఏర్పాట్లు చేస్తోంది. ఈ ఏడాది దాదాపు 5.07 లక్షల మంది విద్యార్ధులు పరీక్ష ఫీజు చెల్లించారు.

దీంతో రాష్ట్ర వ్యాప్తంగా 2,700 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. నిరుటి కంటే ఈ ఏడాది 15 వేల మంది అదనంగా పరీక్షలు రాయబోతున్నారు. దీంతో గతేడాది కంటే ఈ ఏడాది 50 అదనపు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు అధికారులు తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రంలో హాజరయ్యే విద్యార్థుల సంఖ్యను కనిష్టంగా 120 గానూ, గరిష్ఠంగా 280 మందికి పరిమితం చేయనున్నట్లు సమాచారం. అంతకు మించి విద్యార్థులు ఉంటే అదే కేంద్రంలో అంటే ఒకే పాఠశాలలో రెండు పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే అలాంటి పాఠశాలలో అదనపు వసతులు ఉండాల్సి ఉంటుంది.

ఇలా ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాల్లో ఒక పరీక్ష కేంద్రాన్ని ‘ఏ’ పరీక్ష కేంద్రంగా, మరొక దానిని ‘బీ’ కేంద్రంగా వ్యవహరిస్తారు. ఒక్కో కేంద్రంలో ఇద్దరు పోలీసులను బందోబస్తు కోసం వినియోగించాలని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ఈ ఏడాది పదో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు గడువు తేదీని విద్యాశాఖ మరోమారు పొడిగించింది. ఆలస్య రుసుముతో చెల్లించేందుకు ఎస్సెస్సీ బోర్డు అవకాశం కల్పించింది. ఇప్పటి వరకూ ఫీజు చెల్లించని రెగ్యులర్‌, ప్రైవేట్‌ విద్యార్ధులు రూ.1000 ఆలస్య రుసుమును ఫిబ్రవరి 5లోగా చెల్లించవచ్చని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ శనివారం (జనవరి 28) ఉత్తర్వులు జారీ చేశారు. 📅✏️🎓


bottom of page