కర్ణాటకలో సీఎం సిద్ధరామయ్యకు నోటీసులు ఇచ్చినట్టే, రేవంత్‌కు కూడా రేపోమాపో నోటీసులు రావొచ్చంటూ ఆ రాష్ట్ర పీడబ్ల్యూడీ మంత్రి సతీశ్ జార్కిహోళి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. సీఎం రేవంత్ రెడ్డికి ఏ కేసులో నోటీసులు ఇచ్చే అవకాశమున్నదంటూ నెట్టింట పెద్దయెత్తున చర్చ జరుగుతున్నది. రేవంత్‌పై 161 కేసులు
సీఎం రేవంత్ రెడ్డిపై రాష్ట్రవ్యాప్తంగా 89 పోలీసు స్టేషన్లలో ఇప్పటివరకూ 161 కేసులు నమోదయ్యాయి. ఇందులో 70కిపైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో సమర్పించిన అఫిడవిట్‌లో రేవంత్ స్వయంగా వెల్లడించారు. ఇక, 2015లో టీడీపీలో ఉన్న రేవంత్‌రెడ్డి.. అప్పటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు కొనుగోలు చేసేందుకు ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌కు రూ. 50 లక్షలు ఇచ్చేందుకు ప్రయత్నిస్తూ పట్టుబడ్డారు. ఇదే ‘ఓటుకు నోటు’ కేసుగా ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టు విచారణలో ఉన్నది. పెట్టుబడుల పేరిట సోదరుడు జగదీశ్వర్‌రెడ్డికి చెందిన ‘స్వచ్ఛ్‌బయో’తో ఒప్పందం చేసుకోవడం, ఆ కంపెనీ నుంచి తెలంగాణకు రూ.1000 కోట్ల పెట్టుబడులు రానున్నట్టు ప్రకటించడాన్ని తప్పుబడుతూ బీఆర్‌ఎస్ నేత క్రిశాంక్ ఇప్పటికే ఈడీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఇందులో ఏ కేసుకు సంబంధించి రేవంత్‌కు నోటీసులు రావొచ్చని నెటిజన్లు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
వాల్మీకి స్కామ్‌తో 9 హైదరాబాదీ కంపెనీలకు లింక్?
కర్ణాటకలో సిద్ధరామయ్య సర్కారును కుదిపేస్తున్న ‘మహర్షి వాల్మీకి కార్పొరేషన్ లిమిటెడ్’లో వెలుగుచూసిన రూ.187 కోట్ల విలువైన కుంభకోణం మూలాలు హైదరాబాద్‌లోనూ ఉన్నాయని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నివేదిక, ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చేసిన ఇటీవలి విచారణలో తేలింది. కుంభకోణంలో భాగంగా హైదరాబాద్‌కు చెందిన తొమ్మిది కంపెనీల ఖాతాలకు రూ.44.6 కోట్లు జమ అయినట్టు సిట్ నివేదికలో స్పష్టం చేసింది. ఈ ఖాతాలు ఐటీ, జ్యువెలరీ, లిక్కర్ తదితర రంగాలకు చెందిన కంపెనీలవని తెలుస్తున్నది. ఈ స్కామ్ డబ్బునే ఇటీవలి లోక్‌సభ ఎన్నికలకు ముందు ఓ పార్టీ ఖర్చు చేసినట్టు సిట్, ఈడీ నివేదిక వెల్లడించింది. కాగా, వాల్మీకి సామాజిక వర్గంలో బలమైన నేతగా ఉన్న సతీశ్ జార్కిహోళి.. తమ కార్పొరేషన్ నిధులు పక్కదారి పట్టినప్పటికీ ఏమాత్రం స్పందించడం లేదంటూ ఆ వర్గం ప్రజలు ఆయనపై గుర్రుగా ఉన్నారు. ఇదే విషయమై ఆయనపై పలు విధాలుగా అసంతృప్తిని వ్యక్తం చేశారు. దీంతో పెరుగుతున్న అసమ్మతిని చల్లార్చడానికి ఆయన చేయని ప్రయత్నం లేదు. కాగా, ‘వాల్మీకి స్కామ్’ కాంగ్రెస్ పాలిస్తున్న కర్ణాటకలో జరుగడం, అక్కడి డబ్బు తెలంగాణకు చేరడం, తెలంగాణలో రేవంత్ ప్రభుత్వం అధికారంలో ఉండటం, నోటీసుల గురించి ‘వాల్మీకి’ సామాజిక వర్గానికి చెందిన బలమైన నేత జార్కిహోళి సంచలన వ్యాఖ్యలు చేయడాన్ని చూస్తే.. ఈ స్కామ్‌లోనే సీఎంకు నోటీసులు వస్తాయా? అంటూ పలువురు నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.